Categories
నా ఖండ కవితలు

నీవు జీవచ్ఛవమేనని గుర్తుంచుకో

నీవు జీవచ్ఛవమేనని గుర్తుంచుకో

దేశ విదేశాల యాత్రల నేపధ్యం లేనిచో

నిరంతర గ్రంథ పఠనం లేనిచో

నీ గుండె చప్పుళ్ళను నీవు విననిచో

నిన్ను నీవే మెచ్చుకొననిచో

నీవు జీవచ్ఛవమేనని గుర్తుంచుకో

ఆత్మాభిమానాన్ని నీవు చంపుకున్నచో

ఇతరులని నీకు సహాయము చేయనీయనిచో

దురలవాట్లకి నీవు బానిసవైనచో

నీవు జీవచ్ఛవమేనని గుర్తుంచుకో

మార్పులేని జీవనగతిలో నిరంతరము పయనించినచో

నీ యొక్క ఆహార్యాన్ని నీవు మార్చుకొననిచో

అజ్ఞాత వ్యక్తితో స్నేహపూర్వకముగా మాటలు కలపనిచో

నీవు జీవచ్ఛవమేనని గుర్తుంచుకో

ఉత్తుంగ తరంగాలవలే వచ్చు భావ జాలాన్ని  ప్రక్కకు పెట్టినచో

మనసు పొరలలోని భావోద్రేకపూరిత  స్పందనలని విననిచో

అంతరంగాలలోని ఆర్ద్రత నీ కళ్ళల్లో ప్రతిఫలించనిచో

నీ హృదయ తరంగాలని పెడచెవిని పెట్టినచో

నీవు జీవచ్ఛవమేనని గుర్తుంచుకో

నిరాశా నిస్పృహలతో నిండిన నీ జీవన గమనాన్ని మార్చనిచో

అనిశ్చితిని దూరం చేసుకొనుటకు సాహసము చేయనిచో

నీ కలలని ప్రయత్న పూర్వకముగా సాకారము చేసుకొననిచో

నీ వైఫల్యాలకి జీవితములో ఒకసారైనా తిరోగమనము చేయనిచో

నీవు జీవచ్ఛవమేనని గుర్తుంచుకో …………

O.V.L.N. Murthy
Dt 15-05-2023

Pablo Neruda అనే Spanish Poet వ్రాసిన ఒకానొక Spanish కవితకి నా స్వేచ్ఛానువాదం:
(Pablo Neruda a Spanish poet – won Nobel Prize for Literature in 1971)

ఈ కవితలోని భావజాలపు లోతులు నన్ను ఆకర్షించినవి. అందుచే అనువాదం చేసాను.

His Poem (English Version) :

You start dying slowly

if you do not travel,

if you do not read,

If you do not listen to the sounds of life,

If you do not appreciate yourself.

You start dying slowly

When you kill your self-esteem,

When you do not let others help you.

If you become a slave of your habits,

You start dying slowly

Walking everyday on the same paths…

If you do not change your routine,

If you do not wear different colours

Or you do not speak to those you don’t know

You start dying slowly

If you avoid to feel passion

And their turbulent emotions;

Those which make your eyes glisten

And your heart beat fast.

You start dying slowly

If you do not change your life when you are not satisfied with your

job, or with your love,

If you do not risk what is safe for the uncertain,

If you do not go after a dream,

If you do not allow yourself,

At least once in your lifetime,

To run away…..

You start dying Slowly !!!

Categories
నా ఖండ కవితలు

నా బుజ్జి కుక్క పిల్ల

ప్రొద్దున్నే హుషారుగా
గబగబా నా మంచమెక్కి
ప్రక్కంతా కలయజూస్తూ
దేనికో వెదుకుతూ
గభాలున కనిపించిన
డాడీ కళ్ళజోడును

నోట కరచి పట్టి
విజయాన్ని సాధించిన సైనికుడిలా
మంచి రాంకులో ఉత్తీర్ణుడైన
విద్యార్ధి దరహాసంలా
గర్వంగా తలెత్తి అటునిటుజూస్తూ
ఏదీ అమ్మ ఇంకా రాదేమీ
నా విజయానికి మెచ్చి
నాకో ట్రీటునింకా
పట్టుకొచ్చి ఇవ్వదేమీ!
నా విజయానికి ఇంకా గుర్తింపు లేదేమీ!
ఆ అదిగో అమ్మొచ్చింది
నాకు ట్రీటు ఒకటి తెచ్చింది.
హాయిగా తింటాను
నా ఈ రోజు పండింది.
నా బుజ్జి కుక్క పిల్లతో
నాకు శుభోదయమైంది.
నా రోజు కూడా పండింది

O.V.L.N. Murthy

Dt. 09-May-2023

Categories
నా ఖండ కవితలు

నడక

నడక

నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తూ నడుస్తూ నడకలో అవరోధాలెన్నో అధిగమించాను

ఇంకా ఎన్నెన్ని అవరోధాలను అధిగమించాలో! ఏమో!

అందుకే నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తూ నడుస్తూ నడకలెన్నో నేర్చాను

ఇంకా ఏమేమి నడకలు నేర్వాలో! ఏమో!

అందుకే నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తూ నడుస్తూ నడకలో మెలకువలెన్నో నేర్చాను

ఇంకా ఎన్నెన్ని మెలకువలు నేర్వాలో! ఏమో!

అందుకే నడుస్తున్నాను నడుస్తున్నాను

నడుస్తూ నడుస్తూ విజయాలెన్నో సాధించాను

సాధించానని అనుకున్నాను!

ఇంకా ఎన్నెన్ని విజయాలు సాధించాలో ఏమో!

అందుకే నడుస్తున్నాను నడుస్తున్నాను

నడకలో ఎన్నెన్ని బాంధవ్యాలను రుచి చూసానో!

నడకలో ఎన్నెన్ని స్నేహాలను రుచి చూసానో!

నడకలో ఎన్నెన్ని మధురిమలను చూసానో!

అందుకే నడుస్తున్నాను! నడుస్తున్నాను

చివరకి నడకలో గమ్యమేమిటో! ఏమో!

చివరకి నడకలో అర్థమేమిటో! పరమార్థమేమిటో! ఏమో!

చివరకి ఎన్నాళ్ళు నడవాలో! ఏమో!

చివరకి ఎంతెంత  దూరం నడవాలో! ఏమో!

అయినా నడుస్తాను! నడుస్తూనే ఉంటాను!

తెలియక పోయినా నడుస్తూనే ఉన్నాను!

అలుపెరగక నడుస్తాను!

అలసిపోయే దాకా నడుస్తాను!

అందుకే నడుస్తున్నాను!

అందుకే నడుస్తూనే ఉంటాను!

OVLN Murthy

24-SEPT-2022

Categories
శాలివాహన (హాల) గాథాసప్తశతి

గాథా సప్తశతి – గాథ 5 – ఇచ్ఛామి చ తేన దృశ్యమానం

గాథాసప్తశతి – శాలివాహన గాథాసప్తశతి (హాల గాథాసప్తశతి)

మహారాష్ట్రీ ప్రాకృత గాథా సప్తశతి

గాథా సప్తశతి – గాథ 5 – ఇచ్ఛామి చ తేన దృశ్యమానం

హాలుని గాథాసప్తశతి సంకలనములోని గాథలలో శృంగారము ఎక్కువే! ఎక్కడో ఒకటి రెండు చోట్ల తప్ప ఎక్కడా శృంగారం హద్దులు మీరి లేదు. ఎక్కడా సీమాతిక్రమణం, మర్యాదాభంగము లేని అమలిన శృంగారం ఉన్నది.

ఈ గాథలలో ధ్వని, శ్లేష, వ్యంగ్యము, అన్యాపదేశము ఉన్నవి. గాథలు ముఖ్యంగా ధ్వని ప్రధానమైనవి. ఈ గాథలన్నీ ముక్తకములు. గాథాసప్తశతి ఒక ముక్తక కావ్యం. ముక్తకములు అనగా ఏ పద్యమునకు ఆ పద్యం స్వతంత్రం. అనగా, పద్యము లోని భావము, ముందు వెనుక పద్యములతో సంబంధం లేకుండట. గాథ అన్నది ప్రాకృత భాషలోని ఛందస్సు. ఆ ఛందం సంస్కృత భాషలోని ఆర్యా ఛందమునకు దగ్గరగా ఉంటుంది.  

సందర్భం:

ఆడవారు నీలాటి రేవులో నీళ్ళుతీసుకొని వచ్చే సందర్భాలలో, ఇంటిపనులలో ఉన్నప్పుడు, వారి చీరచెరగులు కొద్దిగా అస్తవ్యస్తమవడం సర్వసాథారణం. అందుచే, స్త్రీలు ఇటువంటి దైనందిన కార్యక్రమాలలో నిమగ్నమైనప్పుడు, ఇంటి పనులు చేసుకునేప్పుడు మసలడానికి వీలుగా వారికి కాస్త మరుగు ఏర్పాటు చేయడానికై, వారికై ప్రత్యేకముగా ఇంటికి వెనుక భాగములో ఒక ద్వారాన్ని ఏర్పాటు చేయవలెను అని  మన పూర్వీకులు నిర్థారించారు. ఇల్లు ఇరుకటము-ఆలి మరుకటము గా వ్యవహరించాలి అనేది పూర్వకాలములోని గృహవాస్తు ప్రథానమైన సూత్రం.

అలాగ, ఆ నాటి సమాజములో నిత్యం జరిగే చిన్నపాటి సంఘటనలలోని ఒకానొక సంఘటనయే ఇది! అయితే, కామాతురులు చూసే దృక్కులలో తేడా ఉంటుంది. అప్పుడు ఆ స్త్రీ సిగ్గుతో, తత్తరపాటుతో శరీరాంగాలను కప్పుకొనే ప్రయత్నములో చీర సర్దుకుంటుంది. అటువంటి సందర్భాన్ని వర్ణించిన చక్కటి ముక్తకం ఈ ప్రాకృతగాథ.

గాథ:

జం జం సో ణిజ్ఝాఅఇ అంగోఆసం మహం అణిమిసచ్ఛో

పచ్ఛాఏమి అ తం తం ఇచ్ఛామి అ తేణ దీసంతం


శ్లోకమ్:

యద్యత్స నిర్ధ్యాయత్యంగావకాశం మమానిమిషాక్షః

ప్రచ్ఛాదయామి చ తం తం ఇచ్ఛామి చ తేన దృశ్యమానం

భావం:

ఒక మగువ చీర కొంగు జారి క్రిందకి వచ్చింది. అయ్యో! శరీరాంగములు ప్రస్ఫుటమౌతాయేమో అని ఖంగారు పడుతూ పమిట సర్దుకునే ప్రయత్నం చేస్తోంది. ఇంతలో ఒకడు తరుణవయస్కుడు,  ఓ మూలనుండి కన్నులార్పకుండా చూడనే చూస్తున్నాడు. ఆ కొంటె గానిని తన కనుకొలకులనుండి గమనించింది. సిగ్గుతో ఒదిగింది. బిడియపడుతూ శరీరాంగములను ఆచ్ఛాదించుకునే ప్రయత్నం చేసింది. శరీరాన్ని చీర చెంగుతో కప్పుకుంటోంది.

ఈ గాథకి నా తెలుగు అనువాదం.

తే.గీ.

చీర చెరగు యంశము నుండి జార గాను

కన్ను లార్పక గను కోడె గాని జూచి

వాడు యేభాగముల జూచు వాటి నచట

గప్పు కొనుచుంటి నాతడి కంట పడక

ఇది ఒక సున్నితమైన లజ్జాభావన తో కూడిన సన్నివేశం. ఇంతటి ఉదాత్తమైన భావ జాలంతో ఆనాటి ప్రాకృత గాథలు వర్థిల్లాయి. సంస్కృతంలో కంటే ప్రాకృతంలో కథాసాహిత్యం ఎక్కువ.

శ్లోకం సేకరణ, కథానిక, తెనుగుసేత: 

ఓరుగంటి వెంకటలక్ష్మీనరసింహ మూర్తి

O.V.L. Narasimha Murthy – ఓ.వెం.ల.న. మూర్తి

Date: 07th September, 2022

Categories
ప్రాచీన కావ్యనాటక గ్రంథ పరిచయం

ప్రాచీన కావ్యనాటక గ్రంథ పరిచయం 3 – పద్మప్రాభృతక సౌరభం – శూద్రక మహాకవి

సంస్కృతాంధ్ర సాహితీసౌరభం

ప్రాచీన కావ్యనాటక గ్రంథ పరిచయం 3పద్మప్రాభృతక సౌరభం –  శూద్రక మహాకవి

3. పద్మప్రాభృతక సౌరభం –  శూద్రక మహాకవి

సంస్కృతభాషా ప్రచార సమితి, హైదరాబాదు వారి రజతోత్సవ సందర్భంగా, రజతోత్సవ గ్రంథమాల శీర్షికన ఇరువది ఐదు గ్రంథములను ప్రచురించారు. వాటిలో ఐదవ కుసుమముగా, మహామహోపాధ్యాయ ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మృచ్ఛకటికఛ్చట అనే శీర్షికతో శూద్రక మహాకవి రచించిన రెండు గ్రంథములను సమగ్ర విశ్లేషణతో పరిచయం చేసారు.

శూద్రకుడు వ్రాసిన ఆ రెండు గ్రంథములు 1) మృఛ్చకటికం 2) పద్మ ప్రాభృతక సౌరభం.

ఈ పద్మప్రాభృతకం యొక్క కథారచనా విధానము, భాషాసౌందర్యము,  నూతన భాషా పద ప్రయోగాలు నాకు బాగా నచ్చినందున, ప్రాచీన కావ్య నాటక గ్రంథ పరిచయం శీర్షికన ఇక్కడ పద్మప్రాభృతకసౌరభం ని పునఃపరిచయం చేయ సంకల్పించితిని. దీనికై ప్రథానముగా ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి పుస్తకమునే గ్రహించడమైనది. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారికిని,  ఈ పుస్తమును అందించిన సంస్కృత భాషా సమితి వారికిని ఎంతయూ కృతజ్ఞుడిని. 

పద్మప్రాభృతకం

ఇందలి కథా ఇతివృత్తము శృంగార రస ప్రథానమైనది. వేశ్యాలంపటత్వం గలవారి చుట్టూ పరిభ్రమెంచే కథావస్తువు. ఇటువంటి కాథావస్తువు కలిగిన గ్రంథం గురించి ఇప్పుడు ప్రస్తావించవలసిన ఆవశ్యకత ఏమిటీ అనే ప్రశ్న తలెత్తుతుంది.

దానికి మూడు కారణాలు:

1.  ఈ గ్రంథాన్ని పరిచయం చేయడానికి ప్రథాన కారణం, ఇందులోని భాషాసౌందర్యం. దీనిలో చక్కటి ఉపమానాలూ, నూతన పదప్రయోగాలు అనేకం కనిపిస్తాయి. ఇది రెండవ కారణం

2.  భాషాసంబంధమై వివిథ ప్రక్రియలు రచనలలో ఉపయోగిస్తారు. కాలక్రమేణా జనబాహుళ్యానికి అవి తెలియక మరుగున పడిపోతున్నాయి. భాషాపండితులకి, వాటిని తెలుసుకోవాలనే ఔత్సాహికులకీ తెలియకపోవు. అటువంటి ప్రక్రియలో ఒకటి నాటకం. అన్ని రచనలనీ నాటకాలు అనరు. వాటిలో చాలా భేదాలు ఉన్నాయి. ఏఏ ప్రక్రియలో ఈ గ్రంథాలని రచించారు, ఆ ప్రక్రియల యొక్క లక్షణాలని తెలుసుకోవడం అనేది ఒక కారణం.

3. ప్రస్తుతం మనచుట్టూ నెలకొని ఉన్న సామాజిక స్థితిగతులు, అంత ఉన్నతమైన, ఆదర్శాలు కలిగి ఉన్నది కాదు. భావిపౌరులకు అంతగా అనుకూలమైనవి కావు. అలాగని సమాజం పూర్తిగా భ్రష్టు పట్టేసి ఉందని కాదు. మంచిని నేర్పే కుటుంబాలూ ఉన్నాయి. మంచిని బోధించే ఆచార్యులూ ఉన్నారు. ఎంతో ఉన్నతవిలువలు కలిగిన గొప్ప గొప్ప వారూ ఉన్నారు. అయితే వీరి శాతం చాలా తక్కువగా ఉంటున్నది. చెడ్డవారి శాతం రోజురోజుకీ ఎక్కువైపోతూ ఉన్నది. మరి ఐయితే ఇప్పుడే ఇలాగ ఉందా? ఎప్పుడూ ఇలాగే ఉందా? ఎన్నాళ్ళ క్రితం నుండీ ఇలాగ ఉన్నది? కొన్ని వందల ఏళ్ళ క్రితం, కొన్ని వేల ఏళ్ళ క్రితం భారతదేశ సామాజిక వ్యవస్థలోని తీరు తెన్నులు ఎలాగ ఉన్నాయి అనే విషయాలని తెలుసుకోవాలి అంటే, సామాజిక వ్యవస్థ చుట్టూ పరిభ్రమించే కొన్ని మన తెలుగు భాషలో, సంస్కృత భాషలో ప్రముఖమైన పండితులు రచించిన గ్రంథాలు బాగా ఉపయోగిస్తాయి.

అటువంటి వాటిలో ఉదాహరణకి కొన్ని – శూద్రక మహాకవి రచించిన మృచ్ఛకటికము (ఇది అందరికీ తెలిసిన గ్రంథము – మనం చిన్నప్పుడు పాఠశాలలో దీని గురించి చదువుకున్నాము), శూద్రకుడు రచించిన పద్మప్రాభృతక సౌరభం (ఇది ఎక్కువ మందికి తెలియకపోవచ్చు), తెలుగు భాషలో మహాకవి శ్రీనాథుడు రచించిన క్రీడాభిరామము (ఇది వల్లభరాయ కృతము అని గ్రంథములో వ్రాసి ఉంటుంది, కానీ పండిత ప్రకాండులు దీనిని శ్రీనాథ కృతముగానే నిర్థారించారు), మహారాష్ట్రీ ప్రాకృత భాషలో శాలివాహన చక్రవర్తి రచించిన శాలివాహన గాథాసప్తశతి అనేవి.

ఆనాటి సామాజిక స్థితిగతులను తెలుసుకొనుటకు ఉపయించగలిగే గ్రంథం ఈ పద్మప్రాభృతం.

ఈ పైన ఉదాహరించిన గ్రంథాలని ఈ ముఖ్యోద్దేశముతో పరిచయం చేయవలెనని నా ప్రయత్నం.

కవి పరిచయం:

మృచ్ఛకటికం రచించిన కవి శూద్రకుడు. ఇతడు మహారాజు. శూద్రకుని గురించి, మృచ్ఛకటికం ప్రస్తావనలోనే విపులంగా చెప్పబడి ఉంది. శూద్రక మహారాజు అందగాడు, బ్రాహ్మణ శ్రేష్టులలోనూ, కవులలోనూ అగ్రగణ్యుడు. ఋగ్వేదము, సామవేదము, గణితము, వేశ్యలకి సంబంధించిన లలిత కళలు, గజశాస్త్రములోనూ నిష్ణాతుడు. ఏనుగులతో తలపడి యుద్ధము చేయగల బలశాలి. ఇతడు శివభక్తుడు. ఆశ్వమేధయాగం చేసిన వాడు. కుమారుని రాజ్యాభిషక్తుని చేసి, నూరు సంవత్సరముల పది రోజుల దీర్ఘాయుర్దాయమును అనుభవించిన పిదప, అగ్ని ప్రవేశము చేసి తనువు చాలించాడు.  

శూద్రక కవి క్రీ.పూ. రెండవ శతాబ్దము – క్రీ.శ. రెండవ శతాబ్దము లోపు వాడని విశ్లేషకులకు విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

సంస్కృత భాషలో దృశ్య కావ్యాలను రూపకాలు అని వ్యవహరిస్తారు. వాటిని లాక్షణికులు లక్షణ గ్రంథాలలో పది రూపకాలూ, పద్దెనిమిది ఉప రూపకాలుగానూ చెప్పారు. రూపకాలు:

నాటకము, ప్రకరణము, భాణము, ప్రహసనము, డిమము, వ్యాయోగము, సమవాకారము, వీథి, అంకము, ఈహామృగము అనేవి రూపక భేదాలు. ఉపరూపకాలు: నాటిక, త్రోటకము, గోష్టి, సట్టకము, నాట్యరాసకము, ప్రస్థానము, ఉల్లాప్యము, కావ్యము, ప్రేంఖణము, రాసకము, సంలాపకము, శ్రీగదితము, శిల్పకము, విలాసిక, దుర్మల్లిక, ప్రకరిణి, హల్లీశము, భాణిక అనేవి ఉపరూపకాలు.

మృచ్ఛకటికము, ప్రకరణము అనే రూపక భేదానికీ; పద్మప్రాభృతికము, భాణము అనే రూపక భేదానికీ చెందినవి.

నాటకం, ప్రకరణం మొదలైన కొన్ని రూపక భేదాలలో ఉదాత్తమైన కథావస్తువును గ్రహించాలి అనే నియమం ఉంది. అభిజ్ఞాన శాకుంతలము, మృచ్ఛకటికము వంటివి వీటికి ఉదాహరణలు. మిగిలిన రూపకాలన్నింటిలోనూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను సమాజంతో ముడివడియున్న కథావస్తువే ఉంటుంది.

శ్రీనాథుడు రచించినట్టు చెప్పబడే  క్రీడాభిరామము అనే దృశ్య రూపకం వీధి అనే రూపక భేదానికి చెందినది. భాణము, వీధి రెండును ఇంచుమించుగా సమాన లక్షణములు కలవి. ఈ వీధి రూపకంలో కూడా సమాజంలో ఉన్న అలవాట్లనూ, ఆచార వ్యవహారలనూ విస్త్రుతంగా వర్ణించడమైనది. ఇది బహు శృంగార రసప్రథానమైన, విట సంబంధమైన కథా వస్తువు. చక్కటి భాషాపటిమ కలిగి, సమాసభూయిష్టమైన పద్యాలతో విలసిల్లే ఈ క్రీడాభిరామము అనే వీధి రూపకం భాషావేత్తల పాలిట కొంగుబంగారమే!

ప్రధానమైన రూపకాలలో భాణం ఒకటి. ఇది సమాజంతో  ఘనిష్ట సంబంధం కలిగి, సమాజంలో ఉన్న అలవాట్లనూ, ఆచారాలనూ చెప్పే రూపక విశేషం. భాణంలో ప్రధానంగా సమాజంలో ఉన్న కొన్ని దురాచారలను ఎత్తి చూపడం జరుగుతుంది.

శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన ఆంధ్ర దశరూపకము ను బట్టి, భాణము యొక్క లక్షణములు:

1. ఏకాంకంబు, విటైకపాత్రవర్ణితకల్పితధూర్తచరితంబు, భారతీ వృత్తికంబు భాణంబు

2. సంబోధనోక్తి ప్రత్యుక్తు లాకాశభాషితంబులు

అనగా, భాణములో ఒక్కటే అంకము ఉండును. ఇతివృత్తము కల్పితము. అదియు ధూర్తచరితముగా ఉండవలయును. తానుగాని, యితరులుగాని అనుభవించినదిగా ఉన్నట్టి ధూర్తచరితమును, సమర్థుడును, విద్యావంతుడును అగు విటుడు అను ఒక్క పాత్రయే చెప్పవలెను.

భాణంలో విటుడు అనే ఒకే ఒక పాత్ర రంగస్థలం మీద కనబడతాడు. ఈ విటుడు, అతని ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్ట్లు ఊహించుకొని వానితో అతడు మాట్లాడుతున్నట్లు సంభాషణ కొనసాగుతుంది. సామాజకులు ఆ సంభాషణల ద్వారా ఊహించుకొని విషయాన్ని అర్థం చేసుకొంటారు. ఇదంతా ఏకపాత్రాభినయం. అనగా, విటుడు ఆకాశభాషితాలతో తానే అనుభవించిన లేదా ఇతరులు అనుభవించిన ధూర్తచరితాన్ని చమత్కారంగా వర్ణిస్తూ ఉంటాడు.

తన ఎదుట ఎవరో ఒక వ్యక్తి ఉన్నట్లు ఊహించుకొని, అతనితో చెపుతున్నట్లుగా, అతనితో మాట్లాడుతున్నట్లుగా సంభాషణ సాగించడం అనేదానిని ఆకాశభాషితం అంటారు. ఈ సంభాషణలో ఇతరులను పిలుచుట, యడుగుట, వినుట మొదలగునవి “ఓయీ”, “ఏమంటివి”, ఇట్లంటివా” యనునట్లు ఆకాశవచనములచే జరుగును.

అనగా, భాణము అనే రూపకమంతా, రంగస్థలం మీద ఒకే ఒక వ్యక్తి చేసే ఏకపాత్రాభినయమన్న మాట.

శూద్రకుడు రచించిన పద్మప్రాభృతకసౌరభం భాణము అనే రూపక భేదానికి సంబంధినది.

పద్మప్రాభృతకం లో ప్రథాన ఇతివృత్తం – మూలదేవుడు అనే వానికీ దేవసేన అనే వేశ్యకాంతకూ మధ్య కలిగిన ప్రణయప్రారంభం. మూలదేవుడికి కర్ణీసుతుడు లేదా కర్ణీపుత్రుడు అని మరొక పేరు ఉంది. ఇతడికి ఈ పేరు అతడి ధూర్త చోర ప్రవృత్తి ఆధారంగా వచ్చినది ఇతడు ధూర్తులకు, చోరులకు నాయకుడు.

బాణుడు కాదంబరీ కావ్యం లో కర్ణీసుతుణ్ణి గూర్చి, శశుణ్ణి గూర్చి ఇలాగ నిర్దేశిస్తాడు – “కర్ణీసుత కథేవ సన్నిహిత విపులాచలా, శశోపగతా చ“.

దణ్డి దశకుమార చరిత్ర లోని అపహార వర్మ చరిత్ర లో కూడా చౌర్యాన్ని గూర్చిన గ్రంథాన్ని రచ్చించినట్టుగా కర్ణీసుతుని నిర్దేశం ఉంది. 

వైజయంతీ నిఘంటువులో “కర్ణీసుతః కరటకః స్తేయశాస్త్రస్య కారకఃఅనియూ, “కర్ణీసుతో మూలదేవో మూలభద్రః కలాజ్ఞ్కురః అని హారావళి లోనూ   నిర్దేశింపబడినది.

కథావృత్తాంతం:

కర్ణీసుతుడి మిత్రుడు శశుడు. ఇతడు కూడా విటుడే! కర్ణీపుత్రుని ప్రేయసి దేవదత్త. నవోద్గతయైన ఈమె చెల్లెలు దేవసేనను ఈతడు ఎక్కడనో చూడటం తటస్థించింది. ఈమె కర్ణీపుత్రుని మనస్సుని ఆకర్షించింది. ఈమధ్య ఆమెకు అనారోగ్యం అని తెలుసుకుంటాడు మూలదేవుడు. క్షేమ సమాచారములు తెలుసుకొని రావలసినదిగా కర్ణీసుతుడు తన మిత్రుడైన శశుణ్ణి పంపుతాడు.  ఆ పనిమీద వెడుతూ, శశుడు దారిలో చాలా రకాల మనుషులను కలుస్తాడు. ప్రతీవానితోనూ ఏవో ముచ్చట్లాడుతూ ముందుకు సాగుతాడు. ఆ విధంగా తను ముచ్చట్లాడిన వారందరూ వేశ్యాలంపటులు లేదా వేశ్యలు. దారిలో కనబడిన ఐదారుగురు వేశ్యాయువతులను వాళ్ళ ప్రియుల్నీ పలుకరిస్తూ చివరికి దేవసేన ఇంటికి చేరతాడు శశుడు.

దేవసేనకి కూడా కర్ణీపుత్రునిపై అభిలాష కలిగి ఉంది.  కానీ, అక్కగారి ముఖం చూసి సందిగ్ధావస్థలో పడి ఉంది. శశుడు ఈమె మనసులోని భావాన్ని తెలుసుకుని, ఆమె కర్ణీపుత్రుణ్ణి చేరడంలో తప్పేమీ లేదని నచ్చచెపుతాడు. దీనికి తగ్గ ప్రమాణాల్ని చూపుతాడు.

దక్షాత్మజాః సున్దరి యోగతారాః  కిం నైకజాతాః శశినం భజన్తే,

ఆరుహ్యతే వా సహకారవృక్షః  కిం నైక మూలేన లతాద్వయేన

తాత్పర్యం:   

ఒకే దక్షప్రజాపతి పుత్రికలైన అశ్విన్యాది తారలన్నీ ఒక్క చంద్రుణ్ణి ఆశ్రయించలేదా? ఒకే మూలంలో నుండి బయలుదేరిన రెండు లతలు ఒక సహకారవృక్షానికి అల్లుకోవా?

ఈ విధముగా సప్రణాముగా నచ్చచెప్పి ఆమెకు కర్ణీపుత్రుని మీద అనురాగం దృఢం అయ్యేట్టు చేస్తాడు శశుడు.  ఆమె యొక్క అనురాగానికి చిహ్నంగా ఏదైనా కర్ణీసుతునికి ఇమ్మంటాడు.

అప్పుడామె తన చేతిలో విలాసార్థం ధరించి ఉన్న పద్మం కర్ణీసుతునికి ప్రాభృతంగా, అనగా, కానుకగా ఇమ్మని శశుడికి ఇస్తుంది

ఈ పద్మాన్ని కానుకగా ఇవ్వడమే  ఈ భాణానికి “పద్మప్రాభృతక సౌరభం”  అనే పేరు పెట్టడానికి కారణం. ఈ పద్మప్రాభృతకం అనే ఈ భాణం ప్రమాణము చేత చిన్నదే.

అయితే ఈ భాణం యొక్క విశిష్టత ఏమిటీ అంటే, దీనిలో ఎన్నెన్నో చక్కని వర్ణనలూ, భాషాసంబంధమైన నూతన శబ్దప్రయోగాలూ ఉండడమే కారణం.

అంతే కాక, కవి, సుమారు రెండువేల సంవత్సరాల పైన ఉన్నట్టి ఆ నాటి సమాజంలో ఉన్న కొన్ని దురాచారాలనూ, అలవాట్లనూ, వైదిక బౌద్ధమతాదులలో ఉన్న కొన్ని డాంభికాచారాలనూ చాలా చక్కగా చిత్రించాడు. స్వస్వధర్మాలను బాగా ఆచరించే వారు చాలామందే ఉన్ననూ, వాళ్ళతో పాటు, వేశ్యావృత్తి, జూదం, మద్యపానం మొదలైన అలవాట్లు కలిగిన వాళ్ళు కూడా అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు. పద్మప్రాభృతకంలో చిత్రించిన సమాజాన్ని చూస్తే, అలాగే మృచ్ఛకటికములోనూశూద్రకుడు నాటి సమాజాన్నే చిత్రిస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్క పేర్లలో మాత్రమే భేదం!!

ఈ పద్మప్రాభృతకం లోని భాషావైవిధ్యాన్నీఇతివృత్త విశేషాలనూ, నూతన శబ్దప్రయోగాల గురించీ కొంత తెలుసుకుందాం. దేవసేన యొక్క క్షేమ సమాచారాలను తెలుసుకునేందుకు బయలుదేరిన శశుడు మార్గమధ్యం లో కలిసిన వారితో జరిపే సంభాషణలలోని భాషా చాతుర్యాన్ని, పదప్రయోగాల సౌందర్యాన్ని చూడండి.  వినూత్న రీతిలో ఉంటాయి.

దేవసేన యొక్క క్షేమసమాచారాలను తెలిసికొని రమ్మని మూలదేవుడు శశుణ్ణి  పంపగా  అతడికి  ముందుగా కనబడిన వాడు కాత్సాయన గోత్రుడైన సారస్వతభద్రుడు అనే కవి.

సఖే! కాత్యాయన! కిమిదమాకాశరోమన్థనం క్రియతే?

మిత్రమా! ఏదో ఆకాశాన్ని నెమరు వేస్తున్నావు?

ఏదో కావ్యాన్ని రచించాలనే ఆవేశంలో ఉన్నాను అని సమాధానం వస్తుంది.

పురాణకావ్యపదచ్ఛేదగ్రథన చర్మకారా?

పాత కావ్యాలలోని పదాలు ముక్కలుచేసి వాటిని అల్లే చర్మకారుడా అని సంబోధిస్తూ, ఏ విషయం తీసుకుని వ్రాస్తున్నావు అని అడుగుతాడు (స్వయం ప్రతిభ లేకుండా ఇతరులు వ్రాసిన రచనలలోని వాటిని సేకరించి కూర్పు చేసి వ్రాసే వాళ్ళు). ప్రస్తుతం ఉన్న వసంత ఋతువు గురించి వ్రాసాను అదిగో ఆ గోడమీద వ్రాసి ఉంది చూడు అంటాడు. శశుడు శ్లోకాన్ని చదివి, చాలా అద్భుతంగా ఉంది అంటూ వాక్పురోభాగానామ భాగీ భవ! – మాటలలో తప్పులు పట్టే వాళ్ళ బారిన పడకుండుదువు గాక  అని ఆశీర్వదించి ముందుకు కదులుతాడు.

దగ్గరలో ఉన్న దర్దురకుడు అనే వాడు, ఇతడు కూడా విటుల కోవకి చెందిన వాడే, ఇంత ప్రసిద్ధుడైన కవికి నీ ఆశీర్వాదం ఎందుకు అని వ్యంగ్యంగా, సముద్రాభ్యుక్షణం క్రియతే యద్వాగీశ్వరం వాగ్భిరర్చయసి – నువ్వు వాగీశ్వరునికి వాక్కుతో చేసే అర్చనం సముద్రం మీద నీళ్ళు చల్లినట్టు ఉంది అని నవ్వుతాడు.

సూర్యం యజన్తి దీపైః సముద్రమద్భిః వసన్తమపి పుష్పైః

అర్బామో భగవన్తం వయమపి వాగీశ్వరం వాగ్భిః

సూర్యుణ్ణి దీపాలు చూపించి పూజిస్తుంటారు. సముద్రాన్ని నీళ్ళతో పూజిస్తారు. వసంతాన్ని పువ్వులతో పూజిస్తారు. మేం కూడా వాగీశ్వరుణ్ణి వాక్కులతో పూజిస్తాం అంటూ ముందుకు కదులుతాడు.

పిదప, దారిలో దత్తకలశి అనే వైయాకరణుడు కనిపిస్తాడు. అతడిని తప్పించుకునే ఆలోచనలో పడతాడు ఎందుచేతనంటే అతడి వాగ్వాగురం (మాటల పాశం) నుండి తప్పించుకోవడం కష్టం కావున. తప్పించుకునే మార్గం లేక “స్వాగతమక్షరకోష్టాగారాయ” అంటాడు. అనగా, అక్షరకోష్టాగారానికి (పదాల గోడౌన్ కి) స్వాగతం అని సంబోధిస్తాడు. దత్తకలశి శశుడితో ఎందుకు అలాగ పారిపోవాలనుకుంటున్నావు అని చాలా కఠినమైన పదాలు వాడతాడు. అప్పుడు శశుడు సాధు వ్యావహారికయా వాదా వద – వ్యావహారిక భాషతో కొంచెం మథురంగా మాట్లాడు, ఏవం విధైః కాష్టప్రహారనిష్టురైః వాగశనిభిః – ఇలాగ కర్రదెబ్బల వలె నిష్టురమైన మాటల పిడుగులతో నన్ను కొట్టవద్దు అంటాడు. 

ఆ నాటికి, పాణినీయవ్యాకరణానికి పూర్తి ప్రామాణ్యం అంగీకరించబడలేదు. అందుచే ఈ పాణినీయ వ్యాకరణం చదువుకున్న వారికీ, ఇతర వ్యాకరణ పణ్డితులకీ వాదోపవాదాలు జరుగుతూ ఉండేవి. 

అప్పుడు శశుడు – ఏమైనా నీ పద్ధతి ఏమీ బాగులేదు అంటాడు. ఎందువల్లనంటే –

స్వైరలాపే స్త్రీవస్యోపచారే

కార్యా (కవ్యా) రంభే లోకవాదాశ్రయే చ,

కః సంక్లేషః కష్టశబ్దాక్షరాణాం

పుష్పాపీడే కణ్టకానాం యథైవ  

స్వేచ్ఛగా మాట్లాడుకొంటున్నప్పుడూ (కబుర్లు చెప్పుకొంటున్నప్పుడూ), స్త్రీ వయస్య (Girl Friend) తో ముచ్చటించేటప్పుడు, కావ్యాలలోనూ, లౌకిక విషయాలు మాట్లాడుకొనేటప్పుడు, పరుషాక్షరాలున్న శబ్దాలకి చోటెక్కడ? అలాంటి పదాలు ఉపయోగించడం తలలో ధరించడానికి తయారు చేసే పువ్వుల దండలో ముళ్ళు చేర్చి కట్టినట్టుంటుంది అంటాడు.  

అందుకేనేమో నా ప్రేయసికి కోపం వచ్చింది అంటాడు దత్తకలశి. ఏమైంది చెప్పు విందాం అంటాడు శశుడు.

హవిస్సు హోమం చేయదలచుకున్నాను, నన్ను ముట్టుకోకు ఓసి అపవిత్రురాలా! అన్నాను నా ప్రేయసితో. దానితో ఆమెకి కోపం వచ్చింది.

అప్పుడు శశుడు నవ్వుతూ, ఏమి లోకజ్ఞానమురా నీది! వలచి వచ్చిన దానిని వ్యాకరణవిష్ఫులింగాభిః వాగ్భిః – వ్యాకరణము లోని బొగ్గు నిప్పు ముక్కల వంటి పదాలు ప్రయోగించి హడలుకొట్టడం ఏమంత బాగుంటుంది అంటూ ముందుకు కదులుతాడు. 

అలాగ ఒక పూల అంగడి దాటి శశుడు ముందుకు వెళ్ళగా అతడికి ఒక ముసలి విటుడు కనిపిస్తాడు. అతడు పూర్వం నాటకాలలో విటుడుగా అభినయించే వాడు. అతడికి ప్రస్తుతం వేశ్యలందరూ పెట్టిన పేరు భావజరద్గవ – ముసలి ఆబోతు బావ. జుట్టుకీ శరీరానికీ ఏవేవో రంగులు పూసికొని జరాకౌపీనప్రచ్ఛాదనంముసలితనాన్ని కప్పుకోవడానికి నానావిధాల తంటాలు పడుతున్నాడు. అతడిని చూసి, నీవు పడే బాధ అంతా లేపేనేవ పురాణజర్జరగృహస్యాయోజితం యౌవనం – పాత ఇంటికి రంగు వేసి కొత్త దానిగా చేయడానికి ప్రయత్నించినట్టుంది.

ఇలాగా దారిలో కనబడిన ఐదారుగురు వేశ్యాయువతులను, వాళ్ళ ప్రియులనూ పలకరిస్తూ చివరకి దేవసేన ఇంటికి చేరతాడు. 

అక్కడ ఆమెకు కర్ణీపుత్రునిమీద అనురాగం దృఢం అయ్యేట్టు చేసి, ఆమె అనురాగానికి చిహ్నముగా ఏదేని ఇమ్మని అడుగగా ఆమే విలాసార్థం తన చేతిలో ధరించి ఉన్న పద్మం అతనికి తననుండి ప్రాభృతంగా (కానుకగా) ఇమ్మని శశుడికి ఇస్తుంది. ఇదే ఈ భాణానికి పద్మ ప్రాభృతం అనే పెరు పెట్టడానికి కారణం.   

నూతన శబ్దప్రయోగాలు:

  1. అక్షరకోష్ఠాగారం – పదాల గోడౌన్ – Dictionary
  2. దివాదీపప్రజ్వాలనం – పగలు దీపం వెలిగించడం. అనగా వ్యర్థప్రయత్నం చేయడం.
  3. గోపాలకులేతక్రవిక్రయః – గొల్లపల్లెలో మజ్జిగ అమ్మడం. అనగా వ్యర్థమైన పనిచేయడం.
  4. సూర్యః దీపేన అన్ధకారః ప్రవిశతి – సూర్యుడు దీపం వెలిగించుకుని అంధకారంలో ప్రవేశించడు.
  5. ఆకాశరోమన్థనం – ఆకాశం నెమరువేయడం. అనగా ఏదో ఆలోచిస్తూ కూర్చోవడం. Woolgathering.
  6. సర్వమచిరాదత్యాయతం ఛిద్యతే – గట్టిగా లాగితే ఏదైనా తెగిపోతుంది
  7. సందంశేన నవమాలికామపచినోషి – పట్టకారుతో నవమాలికాపుష్పాలను కోస్తున్నావు. Handling rough
  8. ఉష్ణస్థలీకూర్మలీలా – వేడెక్కినచోట తాబేలు ఉన్నట్టు
  9. గర్వైకవ్రతశాలినీ – ఒక్క గర్వం అనే వ్రతం మాత్రమే పట్టినది. అంటే, చాలా పొగరుమోతు, గర్విష్టి అని అర్థం. Very arrogant
  10. కావ్యవ్యసనీ – ఏదో కావ్యం వ్రాయాలనే తపన, అత్యాసక్తి కలవాడు.
  11. సాధు వ్యావహారికయా వాదా వద – వ్యావహారిక భాషతో కొంచెం మథురంగా మాట్లాడు.
  12. ఏవం విధైః కాష్టప్రహారనిష్టురైః వాగశనిభిః – ఇలాగ కర్రదెబ్బల వలె నిష్టురమైన మాటల పిడుగులతో నన్ను కొట్టవద్దు. 
  13. క్షిప్తః కదర్థయిత్వా హేమన్తే తాలవృన్త ఇవ – హేమంతంలో విసనకర్రను దూరంగా పారవేసినట్లు తిట్టి దూరంగా పంపివేయబడిన వాడు. Shunting away unceremoniously.
  14. సుహృత్కుముదాననవబోధయన్ దివాచంద్రలీలయాతిక్రామసి – పగటి చంద్రుడు వలె మిత్రులనే కలువలను వికసింపజేయకుండా వెళ్ళిపోతున్నావు.  Leaving with out doing any good to the needy. అనగా, అవసరం ఉన్న వాళ్ళకి ఏమీ చేయకుండా వెళ్ళిపోవడం.
  15. పాయసోపవాసః – పాయసం తిని ఉపవాసం చేయడం
  16. మదనీయం ఖలు పురాణమధు – పాత మద్యం బాగా మత్తెక్కిస్తుంది
  17. దీపేన అగ్నిమార్గణం క్రియతే – దీపంతో అగ్నిని వెదకరు
  18. వాయసోచ్ఛిష్టతీర్థజలముపహతం – కాకి ఎంగిలికి తీర్థజలం అపవిత్రం కాదు.
  19. ఇదం ఖలు వర్షర్తుజ్యోత్స్నాదర్శనం – వర్షర్తువులో వెన్నెల కనబడడం. అనగా, ఏడుస్తూ చిరునవ్వు నవ్వడం లేదా ఏడవ లేక నవ్వడం
  20. దీర్ఘసూత్రతా నామ కార్యాన్తరముత్పాదయతి – ఒక పని చేయడంలో ఎడతెగని ఆలోచన చేస్తే, కొత్తపనులు పుట్టుకు వస్తాయి. అంటే, కొత్త పనులు చేయవలసి వస్తుంది.
  21. అనాగతసుఖాశయా ప్రత్యుపస్థితసుఖత్యాగో న పురుషార్థః – ఎప్పుడో సుఖం వస్తుందనే ఆశతో వచ్చిన సుఖాన్ని వదులుకోవడం పురుషార్థం కాదు. అనగా తెలివైన పని కాదు.
  22. మేఘావగూఢమపి చంద్రమసం కుముద్వతీప్రబోధః సూచయతి – మేఘాలు కప్పిఉన్నా కూడా చంద్రుడు ఉదయించినట్టు కలువల వికాసం సూచిస్తుంది.
  23. లజ్జా నామ విలాసయౌతుకం ప్రమదాజనస్య – సిగ్గు అనేది స్త్రీల విలాసరూపమైన సొత్తు. యౌతుకం అనగా  Personal Property. స్త్రీణామాద్యం ప్రణయ వచనం విభ్రమోహి ప్రియేషు అని మహాకవి కాళిదాసు మేఘసందేశంలో అంటాడు. ప్రియుల విషయంలో స్త్రీలు వ్యక్తం చేసే మొదటి ప్రణయ వచనం సిగ్గుతో కూడిన వారి విభ్రమవిశేషాలే అని అంటాడు.
  24. వాక్పురోభాగానామ భాగీ భవ! – మాటలలో తప్పులు పట్టే వాళ్ళ బారిన పడకుండుదువు గాక
  25. సముద్రాభ్యుక్షణం క్రియతే యద్వాగీశ్వరం వాగ్భిరర్చయసి – వాగీశ్వరునికి వాక్కుతో చేసే అర్చనం సముద్రం మీద నీళ్ళు చల్లినట్టు.
  26. వ్యాకరణవిష్ఫులింగాభిః వాగ్భిః – వ్యాకరణము లోని బొగ్గు నిప్పు ముక్కల వంటి పదాలు .
  27. జరాకౌపీనప్రచ్ఛాదనం –  ముసలితనాన్ని జర అనే కౌపీనం కౌపీనం (గోచీ) తో కప్పుకొనడం.  వయసు మీద పడడం. 
  28. భావజరద్గవ – ముసలి ఆబోతు బావ
  29. లేపేనేవ పురాణజర్జరగృహస్యాయోజితం యౌవనం – పాత ఇంటికి రంగు వేసి కొత్త దానిగా చేయడం.  

ఆవిడ మహా మహా పొగరుమోతు – గర్వైకవ్రతశాలినీ; మహా సుత్తి కొట్టేస్తున్నాడు, వీడి సుత్తి నుండి తప్పించుకోవడం కష్టమే – వాగ్వాగురం (మాటల పాశం) నుండి తప్పించుకోవడం; మాటలతో అమ్మో వాయించేస్తున్నాడు, అబ్బా బాదేస్తున్నాడు, చావగొడుతున్నాడు – ఏవం విధైః కాష్టప్రహారనిష్టురైః వాగశనిభిః;  కాస్త సరళంగా మాట్లాడవచ్చు కదా – సాధు వ్యావహారికయా వాదా వద; వగైరా వగైరా అన్నీ మనం ప్రస్తుతకాలంలో సామాన్య జనం మాట్లాడుకునేప్పుడు వ్యక్తం అయ్యే భావజాలము, భావ ప్రకటన, స్పందన ప్రతిస్పందనలూ అన్ని కూడా సరిగ్గా రెండు వేల సంవత్సరాలకు పైనే వ్యక్తీకృతమయ్యే విధంగానే ఉన్నది అని స్పష్టం అవుతోంది. అంటే మనం ప్రస్తుతం వ్యక్తం చేసే పదాలేవీ మనం కొత్తగా కనిపెట్టినవేవీ కాదు, రెండువేల సంవత్సరాలకు పైనే ఇలాంటి పదప్రయోగాలన్నీ వాడుకలో ఉండడమే కాక  కావ్యాలలోకి కూడా చొప్పించుకు పోయాయి. ఇది గ్రహించవలసిన విషయం.  

గమనిక:

ఈ గ్రంథ పరిచయ వ్యాసమునకు పరిశీలించిన, ఉపయుక్తమైన ఏకైక పుస్తకం పుస్తకము

  1. – ఆచార్య డా. పుల్లెల శ్రీరామచంద్రుడు – సంస్కృత భాషా ప్రచార సమితి, హైదరాబాదు వారి ప్రచురణ

విషయ సేకరణ, అభిలేఖనము: ఓ.వెం.ల.న. మూర్తి – O.V.L.N. Murthy

Date: Tuesday, 30th August 2022

Categories
అభిలేఖాగారము

అభిలేఖాగారం – అభిలేఖ 21 – దేశ భాషలందు తెలుగు లెస్స

అభిలేఖాగారం అభిలేఖ 21 – దేశ భాషలందు తెలుగు లెస్స

అభిలేఖ 21దేశ భాషలందు తెలుగు లెస్స

1953 వ సంవత్సరములో వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే వల్లభరాయ కృతమైన క్రీడాభిరామము అనే వీధి నాటక గ్రంథము ముద్రితమైనది.

ఈ గ్రంథమునకు శ్రీ బండారు తమ్మయ్య గారు విశేష పీఠికని రచించారు. ఈ పీఠికలో శ్రీనాథుడు భీమఖండ – కాశీఖండ రచనముల నడుమ కాలములో విజయనగర ప్రయాణ సందర్భమున వినుకొండ వల్లభరాయని సందర్శించి క్రీ.శ. 1435 వ సం. ప్రాంతమున వల్లభ రాయనికి క్రీడాభిరామ గ్రంథ రచనమున సాయపడెనని నిర్ణయించడమైనది.

అయితే, విద్వన్మణి అయిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు మాత్రము, రచనాశైలిని బట్టి, వర్ణనా చాతుర్యములని బట్టి, భాషా వైభవాన్ని బట్టి మరియూ అనేక దృష్టాంతముల దృష్ట్యా ఈ క్రీడాభిరామము అనే వీధి నాటక గ్రంథాన్ని శ్రీనాథుడే వ్రాసినట్టు క్రీడాభిరామము అనే పేరున వ్రాసిన విశేషమైన విశ్లేషణతో కూడిన తన యొక్క ప్రత్యేక వ్యాఖ్యాన గ్రంథములో నిర్థారించినారు.  

ఈ క్రీడాభిరామాన్ని వల్లభ రాయడు రచించినా, శ్రీనాథుడే రచించినా, ఈ గ్రంథములోని 37 వ పద్యం మాత్రము – ఆటవెలది గీతం మన తెలుగు భాషా ప్రాభవాన్ని తెలియ జేస్తోంది.

1435 సం. ప్రాంతంలోని సాహితీవేత్త వినుకొండ వల్లభరాయడు వ్రాసిన  క్రీడాభిరామం – ఆనాటి ఓరుగల్లు వీథులలో వెల్లి విరిసిన ఆంధ్ర సాంఘిక జీవనానికి అద్దం పట్టే ఒక చలన చిత్రము వంటిది. ఈ క్రీడాభిరామము వ్యంగ్య, శృంగారభరితమైన, మిక్కిలి భాషాపటిమ కలిగిన వీధి నాటక గ్రంథము.

దశ విధ రూపకాలలో వీధి అనేది ఒక రూపక ప్రక్రియ. త్రిపురాంత వాసి యగు రావిపాటి త్రిపురాంతకుడు సంస్కృత భాషలో ప్రేమాభిరామము అనే వీధి నాటకాన్ని రచించాడు. రసవత్తరమగు ఆ దృశ్య ప్రబంధమును చదివి వినుకొండ వల్లభరాయడు దానియందాసక్తుడైనాడు.  కథా ప్రస్తావనలో, వల్లభరాయడు ఈ విధముగా తెలియజేస్తాడు.

ఆ మంత్రి శేఖరుండు రావిపాటి త్రిపురాంతక దేవుండను కవీశ్వరుండొనరించిన ప్రేమాభిరామ నాటకంబుననుసరించి క్రీడాభిరామంబను రూపకంబు తెనుగుబాస రచయించిన వాడు.   

శ్రీకృష్ణదేవరాయల కన్నా ముందుగా 15వ శతాబ్ది తొలి అర్థభాగంలో జీవించిన వినుకొండ వల్లభరాయుడు క్రీడాభిరామమనే ఈ వీథి నాటకాన్ని రచిస్తూ, ప్రస్తావనలోని 37వ పద్యంగా రచించిన జనని సంస్కృతంబు … అనే పద్యంలో ఈ వాక్యం ప్రస్తావనకు వస్తుంది. ఈ పద్యంలో ప్రముఖవాక్యమైన దేశభాషలందు తెలుగు లెస్స అనే వాక్యాన్ని ఉటంకించారు.   

ఆ వల్లభరాయుని పద్యం:

ఆ.వె.

జనని సంస్కృతంబు సకల భాషలకును

దేశ భాషలందు తెలుగు లెస్స

జగతి తల్లి కంటె సౌభాగ్య సంపద

మెచ్చు టాడుబిడ్డ మేలు గాదె?       

  • క్రీడాభిరామము — వినుకొండ వల్లభరాయడు

రావిపాటి త్రిపురాంతకుడు – ఈతడిని వల్లభరాయడు తిప్ప విభుడు అని ప్రస్తావించాడు. తిప్పన్న కృతి యైన ప్రేమాభిరామం తల్లియైనచో, తిప్పవిభు వల్లభుని యనుసరణము క్రీడాభిరామము  బిడ్డ అగును. తల్లి కావున దానికి గౌరవమున్నను, అనుభవము విషయమున బిడ్డదే పై చేయి. మూలకృతియందు భాష సంస్కృతము అగుటచేత సామన్యులకు క్లిష్టము. దేశభాషలలో తెలుగు లెస్స లేదా శ్రేష్టము కావున నా ఈ అనుసరణమైన క్రీడాభిరామము కూడా లెస్స యగును అనేది ఈ పద్యముయొక్క భావము.

ఇక్కడ ఈ పద్యములో, సంస్కృతానికి దేవభాషగా, అన్ని భాషలకు తల్లిగా గౌరవాన్ని చూపించి, దేశభాషలలో మాత్రం తెలుగు గొప్పది అని చెబుతున్నాడని గమనించాలి.

ఈ అద్భుతమయిన కావ్యంలో “దేశభాషలందు తెలుగు లెస్స” అని శ్రీ కృష్ణదేవరాయల కంటె ముందరే వల్లభరాయలవారు సెలవిచ్చారు.

శ్రీకృష్ణ దేవరాయలు క్రీ.శ. 17 వ తేది జనవరి నెల 1471 వ సం. లో జన్మించి,  క్రీ.శ. 17 వ తేది అక్టోబర్ నెల 1529 వ సం. లో కాలం చేసినట్టు చరిత్ర ఆధారాలని బట్టి తెలుస్తున్నది. స్వయముగా సంస్కృతాంధ్ర భాషలలో ఉద్దండ ప్రావీణ్యం కలిగిన కవి చక్రవర్తి.

శ్రీనాథ యుగానికి చెందిన వినుకొండ వల్లభరాయుడు రచించిన వ్యంగ్య, శృంగారభరిత నాటకమైన క్రీడాభిరామం యొక్క భాషా పటిమ, పదప్రయోగాల ప్రభావం తరవాత కాలములోని వాడగు శ్రీకృష్ణదేవరాయలపై ఉందని సింగరాచార్యులు వంటి సాహిత్య విమర్శకుల అభిప్రాయం.

భారీగా యుద్ధాలు చేసి అలసిపోయిన శ్రీకృష్ణదేవరాయలు తీర్థయాత్రలు చేసాడు. ఆ సందర్భంలో ఆయన కృష్ణాజిల్లాలోని శ్రీకాకుళానికి వచ్చాడు. అక్కడ ఆ రాత్రి విశ్రమించినపుడు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి విష్ణు చిత్తీయం అనే ఆముక్తమాల్యద వ్రాయమని ఆదేశించాడు. ఆ సందర్భంలో ఆంధ్రదేవుడు మాట్లాడుతూ, మదాలస చరిత్ర, సత్యావధూ ప్రీణనంబు, సకల కథాసార సంగ్రహంబు, సకల కథాసార సంగ్రహం, జ్ఞాన చింతామణి, రసమంజరీ వంటి కావ్యాలను సంస్కృతంలో వ్రాసావు కదా, నీకు ఆంధ్రంలో వ్రాయడం  కష్టసాధ్యమా? ఇక తెలుగు లోనే ఎందుకు వ్రాయాలంటావా? అంటూ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కలలో  శ్రీకృష్ణదేవరాయలకు ఈ పద్యం చెబుతాడు.

అయితే ఆముక్తమాల్యద ప్రస్తావనలో వ్రాసి గ్రంథస్తం చేసినది శ్రీ కృష్ణ దేవరాలే కదా! అందుచేత ఈ పద్యాన్ని, దానిలో రాయలవారు సెలవిచ్చిన విధంగా దేశభాషలందు తెలుగు లెస్స అనేది అతడు చెప్పినదిగానే భావించి అన్వయించడమైనది.

ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా పలికిన పలుకులు ఇవి.

ఆ.వె.

తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను

తెలుగు వల్లభుండ తెలుగొకండ

ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి

దేశ భాషలందు తెలుగు లెస్స

— శ్రీ కృష్ణదేవ రాయలు

కవి పణ్డితుడు, చక్రవర్తి అయిన శ్రీకృష్ణ దేవరాయలు తన ఆముక్త మాల్యద కావ్యములో వ్రాసిన ఈ పద్యం విశేష ప్రాచుర్యాన్ని పొంది, దేశభాషలందు తెలుగు లెస్స అనే వాక్య ప్రయోగాన్ని శ్రీకృష్ణ దేవరాయలు వ్రాసినదిగానే బహుళ ప్రచారం పొందింది. వాడుకలో స్థిరపడింది.

పద విభాగం:
తెలుఁగదేలనన్న = తెలుగు + అది + ఏల + అన్న; దేశంబు దెలుఁగేను = దేశంబు + తెలుగు + ఏను (=నేను); తెలుఁగు వల్లభుండఁ(న్) = తెలుగు + వల్లభుండ(ను); దెలుఁగొకండ = తెలుగు ఒకండ; యెల్ల నృపులగొలువన్ = ఎల్ల నృపులు + కొలువను; ఎరుగవే బాసాడి (=భాషణము చేసి); దేశభాషలందుఁ తెలుఁగు లెస్స = దేశ భాషల + అందు +తెలుగు లెస్స! శ్రేష్టము లేదా ఉత్తమము

తాత్పర్యం:

“తెలుగులో వ్రాయడం ఎందుకంటావా, ఈ దేశం తెలుగువారిది. నేను తెలుగు (వారి) ప్రభువుని. ఇక తెలుగు భాషంటావా, చాలా గొప్పది. ఐనా అనేక దేశాల రాజులు నిన్ను దర్శించుకొన్నప్పుడు వారితో పలు భాషలలో మాట్లాడే నీకు దేశభాషలన్నింటిలో తెలుగు శ్రేష్టమైనదని తెలియదా!”

తెలుగే ఎందుకంటే దేశం తెలుగుదేశం, నేను తెలుగువాడినైన రాజును (ఇక్కడ శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు, తాను తెలుగువాడినని చెప్పుకున్నాడు గానీ శ్రీకృష్ణదేవరాయలు కాదని గ్రహించాలి), తెలుగు ఒకండ – అంటే తెలుగు ప్రత్యేకమైనది అని అర్థం. అనేక రాజులు నిన్ను కొలువగా, దేశభాషలలో తెలుగు గొప్ప అని నీకు తెలియదా? అనేక రాజులు నిన్ను కొలువగా వారితో వివిధ దేశభాషలలో మాట్లాడిన నీకు దేశభాషలన్నింటిలో తెలుగు లెస్స (శ్రేష్టము) అని ఎరుగవా?

దేశభాషలందు – అన్నప్పుడు దేశభాషలు అన్న శబ్దానికి దేశీయమైన వ్యావహారిక భాషలు అన్న అర్థమే సబబని గమనించాలి. మనకు సంస్కృతం దేవభాష. అది మాతృ బాష. సంస్కృతం నుండి వచ్చిన ప్రాకృతాది భాషలు తద్భవాలు. అవి కాకుండా దేశంలో వ్యావహారికంలో వాడుకలో ఉన్న ఇతర దేశీయమైన భాషలు దేశభాషలు. ఆ దేశభాషలలో తెలుగు భాష గొప్పది అని చెప్పడం ఈ పద్యంలో వివరిస్తున్నాడు.

కృష్ణదేవరాయలు మన తెలుగు భాష గురించి చెప్పిన మరొక ఆణిముత్యం వంటి వాక్యము – ఎవరు ఏమన్ననేమి నిజము నాదు కర్ణాట భాష అంటాదు ఒకానొక పద్యములో. కృష్ణదేవ రాయలు కన్నడ దేశ రాజుగానే చరిత్ర చెపుతుంది. ఇక్కడ కర్ణాట భాష అంటె నేటి కన్నడ భాష కాదు అనేది అభిప్రాయం. కర్ణాట భాష అనగా చెవికి ఇంపైన భాష అదియే అతని ద్వారా ఎవరు ఏమన్ననేమి నిజము నాదు కర్ణాట భాష అనిపించింది.

నిఘంటు విశేషాలని చూడండి:

కర్ణాట: సంస్కృత-ఆంధ్ర నిఘంటువు (వ్యుత్పత్తి, నిర్వచన సహితంగా) (ముదిగంటి గోపాలరెడ్డి) 2019.
[కర్ణ+అట+అచ్, కర్ణేషు అటతి ప్రభూత యశస్వినః ఏతద్దేశస్య రాజ్ఞః గుణాది కీర్తనేన సర్వేషాం కర్ణేషు అటతి భ్రమతి] ఒక దేశము. ఈ దేశపు రాజగుణములన్నియు (కీర్తి మొదలగునవి) అందరి చెవిన పడును.


కర్ణాట: సంస్కృత-ఆంధ్ర నిఘంటువు (వ్యుత్పత్తి, నిర్వచన సహితంగా) (ముదిగంటి గోపాలరెడ్డి) 2019.
[కర్ణ+అట+అచ్, కర్ణేషు శ్రోతృశ్రవణేషు అటతి రాగవిశేషః] శ్రోతల చెవులయందు తిరుగుచుండును. ఒక రాగము.

తెలుగు భాషా మాథుర్యాన్ని గురించి అనేకమంది కవులు, రచయితలు అనేక విధాలుగా కీర్తించారు రచనలు చేసారు.

వివిధ కవుల శ్లాఘించిన ఒకటి రెండు వాక్యాలని ఆస్వాదించండి.

  • పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న

రసరాజు అనే కవి తెలుగు భాష తీయదనాన్ని గురించి వ్రాసిన గేయం చూడండి.

  • మల్లె పూల కంటె, మంచి గంధము కంటె

పంచదార కంటె పాల కంటె

తెలుగు బాష లెస్స

దేశ భాషలకు సంగీత భాష

తెలుగు జాతి భాష

పద్యాల సేకరణ, అభిలేఖనము:        

ఓరుగంటి వెంకట లక్ష్మీనరసింహ మూర్తి

ఓ.వెం.ల.న. మూర్తి – O.V.L.N. Murthy

Date: Sunday, 28th August, 2022

Categories
చాటుపద్య భాండాగారము

శ్రీనాథుడి చాటువులు – కవితల్ చెప్పిన పాడ నేర్చిన…

శ్రీనాథుడి చాటువులు – కవితల్ చెప్పిన పాడ నేర్చిన…
మ.
కవితల్ చెప్పిన, పాడనేర్చిన, వృధా కష్టంబె యీ భోగపుం
జవరాండ్రే కదా భాగ్య శాలినులు! పుంస్త్వంబేల పోగాల్పనా!
సవరంగా సొగసిచ్చి, మేల్ యువతి వేషంబిచ్చి పుట్టించితే
నెవరేన్మెచ్చి ధనంబులిచ్చెదరు కాదే పాపపుందైవమా

Categories
చాటుపద్య భాండాగారము

శ్రీనాథుడి చాటువులు – గరళము మ్రింగితినంచున్…

శ్రీనాథుడి చాటువులు – గరళము మ్రింగితినంచున్…
కం.
గరళము మ్రింగితినంచున్
బురహర! గర్వింపబోకు పో! పో! పో! నీ
బిరుదింక గాన వచ్చెడి
మెఱసెడి రేనాటి జొన్న మెదుకులు తినుమీ!

Categories
చాటుపద్య భాండాగారము

శ్రీనాథుడి చాటువులు – బూడిద బ్రుంగివై…

శ్రీనాథుడి చాటువులు – బూడిద బ్రుంగివై…
ఉ.
బూడిద బ్రుంగివై యొడలు పోడిమి దప్పి మొగంబు వెల్లనై
వాడల వాడలన్ దిరుగు చు వారును వీరును జొచ్చొచోయనన్
గోడలగొందులన్ దిరిగి కూయుచునుండెదు కొండవీటిలో
గాడిద! నీవునంగవివి కావుగదా ? యనుమానమయ్యెడిన్

Categories
చాటుపద్య భాండాగారము

శ్రీనాథుడి చాటువులు – హా జలజాక్షి…

శ్రీనాథుడి చాటువులు – హా జలజాక్షి…
ఉ.
హా జలజాక్షి! హా కిసలయాధర! హా హరిమధ్య! హా శర
ద్రాజ నిభాస్య! హా ప్రమద తంత్ర కళానిధి! యెందు బోయితే
రాజ మహేంద్ర వీధి గవిరాజు ననుంగికురించి భర్గ కం
ఠాజిత కాల కూట ఘటికాంచితమైన యమాస చీకటిన్